Breaking News

సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు-షర్మిల.

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన ప్రచారంలో ఆమె ముఖ్యంగా తన అన్న, సీఎం జగన్ ను టర్గెట్ చేస్తున్నారు. కడప జిల్లా పెద్దముడియం మండలంలో షర్మిల మాట్లాడుతూ జగన్ పై మరోసారి విమర్శనాస్త్రాలను సంధించారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో. వైఎస్ రాజశేఖరరెడ్డికి వైఎస్ వివేకా అలాగే అని చెప్పారు. వివేకాను గొడ్డలితో ఏడు సార్లు క్రూరంగా నరికి దారుణంగా హతమార్చారని అన్నారు. వివేకా హత్య జరిగి ఐదేళ్లు అయిపోయిందని. ఇంత వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా అంటే వైఎస్ కు ఎంతో ఇష్టమని. వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసని షర్మిల అన్నారు. హత్యకు సంబంధించిన ప్రతి ఒక్క ఆధారం సీబీఐ వద్ద ఉందని చెప్పారు. వైఎస్ అవినాశ్ రెడ్డి నిందితుడు అనే సాక్ష్యాలు కూడా ఉన్నాయని తెలిపారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారని. సీఎం అయిన తర్వాత సీబీఐ విచారణ వద్దంటున్నారని విమర్శించారు. సీబీఐ విచారణకు జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్నవారు ఓవైపు ఉన్నారని. మరోవైపు న్యాయం, ధర్మం వైపు నిలబడ్డ తాము ఉన్నామని షర్మిల అన్నారు. మీ బలం, మీ గొంతు, మీ బిడ్డగా ఇక్కడే ఉంటానని. తన జీవితం మీకే అంకితమని… తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు.