Breaking News

కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై తీవ్ర విమర్శలు కురిపించిన ప్రధాని.

కాంగ్రెస్ తీరుపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం నెలకొందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్లకంటే రాష్ట్రంలో ‘ఆర్ఆర్’ ట్యాక్స్ వసూళ్లే మించిపోయాయని ఆరోపించారు. ప్రజలు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపెడుతున్నారని, ఇప్పటి వరకు జరిగిన మూడు దశల లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవమే ఎదురైందని చెప్పారు. మిగతా నాలుగు దశలలోనూ ఆ పార్టీకి ఓట్లు రాలవని చెప్పారు. బీజేపీ, ఎన్డీయే కూటమిని గెలిపించుకోవాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పారు. కరీంనగర్‌ లో బండి సంజయ్‌ గెలుపు ఖరారైందని చెప్పారు. ఈమేరకు వేములవాడలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉదయమే వేములవాడ చేరుకున్న ప్రధాని.. ముందుగా రాజరాజేశ్వరుడిని దర్శించుకున్నారు.అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి భారీగా వచ్చిన జనం ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.
ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడానికి గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మీరు వేసిన ఓటే కారణమని మోదీ చెప్పారు. బీజేపీకి రెండు పర్యాయాలు మీరు ఇచ్చిన అవకాశం వల్లే ఇప్పుడు దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని వివరించారు. ఈ క్రమంలోనే మరోసారి మీ ఆశీర్వాదం కోరేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తే తమ కలలు సాకారమవుతాయని ప్రజలు భావించారు. అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని, వాటి మధ్య ఫెవికాల్ బంధం ఉందని మోదీ విమర్శించారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రయోజనాలను పక్కన పెట్టి సొంత ప్రయోజనాల కోసమే పనిచేసిందని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన పని కూడా ఇదేనని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలేనని, వాటికి కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ అడ్రసు కూడా ఈ ఎన్నికల్లో గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. అధికారంలోకి రాకముందు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాఫ్తు జరిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.